Dasharathi Shatakam
శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం: ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు. ఆ వంశంలో యతీపవుసీత రఘుమహారాజు గొప్పవాడు.అటువంటి వంశపరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పులు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడ ం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనేపేరుగలవాడు. దయకు సముద్రం వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు.
ప్రతిపదార్థం: శ్రీ అంటే సంపదలకు నెలవైన; రఘు అంటే రఘుమహారాజు వంశంలో పుట్టిన రామా; చారు అంటే అందమైన; తులసి అంటే తులసి అనే పేరు గల మొక్క; దళ అంటే ఆకులతో; దామ అంటే తయారయిన మాలిక గలవాడా; శమ అంటే శాంతి; క్షమ అంటే ఓర్పు; ఆది అంటే మొదలైన; శృంగార అంటే అందమైన; గుణ అంటే లక్షణాలచేత; అభిరామ అంటే మనోహరుడైనవాడా; త్రిజగత్ అంటే ముల్లోకాల చేత; నుత అంటే పొగడబడిన; శౌర్య అంటే పరాక్రమం; రమా అంటే సంపద అనెడి; లలామ అంటే అలంకారం కలవాడా; దుర్వారఅంటే అడ్డుకోలేని; కబంధ అంటే కబంధుడు అనే పేరు గల; రాక్షస అంటే రాక్షసుడిని; విరామ అంటే సంహరించినవాడా; జగత్ అంటే లోకంలోని; జన అంటే ప్రజల; కల్మష అంటే పాపాలు అనే; అర్ణవ అంటే సముద్రాన్ని; ఉత్తారక అంటే దాటించే; నామ అంటే పేరుగలవాడా; కరుణాపయోనిథీ అంటే దయలో సముద్రం వంటివాడా; భద్రగిరి అంటే భద్రాచలంలో కొలువై ఉన్న; దాశరథీ అంటే దశరథుని కుమారుడైన రామా!
రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో ద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: దయకు సముద్రం వంటివాడవైనవాడు దశరథరాముడు. అందరినీ సంతోషపెట్టేవాడు. చేసిన పాపాలను తొలగించేవాడు. కల్పవృక్షపు తీగలే తోటగా కలిగి, శుభప్రదమైన లక్షణాలను ప్రసాదించేవాడు. జననమరణాల వంటి ఆరు వికారాలను జయించేవాడు. మంచివారిని రక్షించడమే దీక్షగా కలవాడు. దయ అనే గుణం కలిగినవాడు. ఇన్ని లక్షణాలతో ప్రకాశిస్తున్న భద్రాద్రిరామా! నీ పాదాలను కొలుచుకుంటాను.
ప్రతిపదార్థం: రాముడు అంటే ఆనందం కలిగించేవాడు; ఘోర అంటే భయంకరమైన; పాతక అంటే పాపాలను; విరాముడు అంటే పోగొట్టేవాడు; సత్ + గుణ అంటే మంచిగుణాలు అనెడి; కల్పవల్లికా అంటే కల్పవృక్షపుతీగయే; ఆరాముడు అంటే తోట అయినవాడు; షట్ + వికార అంటే జననమరణాలు మొదలైన ఆరు వికారాలను; జయ అంటే తెలియచేయడం చేత; రాముడు అంటే మనసు తెలిసినవాడు; సాధుజన అంటే మంచివారిని; ఆవన అంటే రక్షించటం అనే; వ్రత అంటే నియమం చేత; ఉద్దాముడు అంటే గొప్పవాడైన; శ్రీరాముడే అంటేఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడే; మాకు అంటే మా అందరికీ; పరమ దైవము అంటే ప్రధానమైన దేవుడు అని; మీ అంటే మీ యొక్క; అడుగు అంటే పాదాలు అనెడి; కెంపు + తామరలను అంటే ఎర్రతామరలను; ఏను అంటే నేను; భజించెదను అంటే పూజిస్తాను; దాశరథీ అంటే దశరథుని కుమారుడైన రామా; కరుణ అంటే దయకు; పయోనిధీ అంటే సముద్రుని వంటివాడా!
చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!
పద విభాగం: చక్కెర, మాని, వేము, తినజాలిన, కైవడి, మానవ, అధముల్, పెక్కురు, బక్క, దైవముల, వేమరు, కొల్చెదరు, అట్లు, కాదయా, మ్రొక్కిన, నీకు, మ్రొక్కవలె, మోక్షము, ఒసంగిన, నీక, ఈవలెన్, తక్కిన, మాటలు, ఏమిటికి, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: దయాగుణం కలిగిన దశరథరామా! జ్ఞానం లేని వారు తియ్యగా ఉండే పంచదారను వదిలి, చేదుగా ఉండే వేప ఆకును తింటారు. ఆ విధంగా కొందరు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేక, చిల్లరదేవుళ్లను కొలుస్తున్నారు. ఇది మంచిది కాదు. అందరూ మొక్కదగినవాడవునువ్వే. మోక్షమిచ్చేవాడివి కూడా నువ్వే. ఇంక ఇతరమైన మాటలు మాట్లాడటం అనవసరం.
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ
భండన, భీముడు, ఆర్తజన, బాంధవుడు, ఉజ్జ్వల, బాణ, తూణ, కోదండ, కళా, ప్రచండ, భుజ, తాండవ, కీర్తికి, రామమూర్తికిన్, రెండవ, సాటి, దైవము, ఇక, లేడనుచున్, కడకట్టి, భేరికా, ఢాండ, డఢాండ, ఢాండ, నినదంబులు, అజాండము, నిండ, మత్తవేదండమును, ఎక్కి, చాటెదను, దాశరథీ, కరుణాపయోనిధీ!
భావం: కరుణకు నెలవైన దశరథ కుమారా! ఓ శ్రీరామా! యుద్ధంలో శత్రువులకు నీ రూపంతో భయం కలిగించినవాడివి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే చుట్టానివి. బాణాలు, అమ్ములపొదులు కలిగినవాడివి. విలువిద్య అనే గొప్పదైన కళలో కీర్తికలవాడివి. అటువంటి నీకుసాటిరాగల వేరొక దైవం లేడు. నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగును ఎక్కి, భేరిక వంటి చర్మవాద్యాల మీద నుంచి వచ్చే ‘ఢాం ఢాం’ ధ్వనులతో మార్మోగిపోయేట్లుగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేసేలా ప్రకటిస్తాను.
జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే తర్రుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ
జుర్రెద, మీ, కథ, అమృతము, జుర్రెద, మీ, పద, పంకజ, తోయమున్, జుర్రెద, రామ, నామమున, జొబ్బిలుచున్న, సుధారసంబు, నే, జుర్రెద, జుర్రు, జుర్రగ, రుచుల్, కనువారి, పదంబు, కూర్పవే, తర్రుల, తోడి, పొత్తిడక, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: దయాగుణం కలిగిన దశరథరామా! నీ గురించిన కథలు అమృతంలా ఉంటాయి. ఆ అమృతాన్ని తాగుతాను. కమలాల వంటి నీ పాదాల నుంచి పుట్టిన తీర్థజలాన్ని నోరారా జుర్రుతాను. ‘రామా’ అనే మాటను పలకడం వలన కలిగిన సుధారసాన్ని ఎంతో ఇష్టంతోఆరగిస్తాను. నన్ను నీచులైన మనుష్యులతో స్నేహం చేయకుండా కాపాడు. జాలిగుణం కలిగిన నిన్ను, నీ పాదాలను సేవించే రుచులను పొందే వారి స్నేహాన్ని కలగచేయి.
పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ!
పదవిభాగం: పెంపున, తల్లివై, కలుష, బృంద, సమాగమము, పొందకుండ, రక్షింపను, తండ్రివై, మెయి, వసించు, దశ, ఇంద్రియ, రోగముల్ , నివారింపను, వెజ్జువై, కృప, గురించి, పరంబు, తిరంబుగాగ, సత్, సంపదలు, ఈయ, నీవె, గతి, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: దయాగుణం కలిగిన ఓ దశరథరామా! మమ్మల్ని పెంచి పోషించటానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలను పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే పది ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుని రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయచూపటానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు.
పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ
పదవిభాగం: పాపములు, ఒందువేళ, రణ, పన్నగ, భూత, భయ, జ్వర, ఆదులందు, ఆపదను, ఒందువేళ, భరత, అగ్రజ, మిమ్ము, భజించు, వారికిన్, ప్రాపుగ, నీవు, తమ్ముడు, ఇరుపక్కియలన్, చని, తత్, విపత్తి, సంతాపము, మాన్పి, కాతురట, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: అయోధ్యను పాలించే దశరథమహారాజు కుమారుడైన శ్రీరామా, కరుణకు మారుపేరయినావాడా, రామా! పాపం చేసినప్పుడు, పాపం వలన భయం కలిగినప్పుడు, బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరం వంటి రోగాలతో బాధ పడుతున్నప్పుడు, ఆపదలు కలిగినసమయంలోనూ… నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నువ్వు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలసి వచ్చి, కష్టాలలో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి, ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు.
కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ!
పద విభాగం: కోతికి, శక్యమా, అసుర, కోటుల, గె ల్వను, గెల్చెబో, నిజంబు, ఆతని, మేన, శీకరుడు, ఔట, దవానలుడు, ఎట్టి, వింత, మా సీత, పతివ్రతా, మహిమ, సేవక, భాగ్యము, మీ క టాక్షమున్, ధాతకు, శక్యమా, పొగడ, దాశరథీ, కరుణాపయోనిధీ
భావం: దశరథుని కుమారుడైన శ్రీరామా! దయాగుణంలో సముద్రుడవైన ఓ రామా! ఒక సామాన్యమైన కోతి, కోట్లకొలదీ భయంకరమైన రాక్షసులను గెలవటం సాధ్యం కాదు. పోనీ ఏదో ఒక ప్రభావంతో గెలిచిందనుకుందాం. కాని ఆ కోతి తోకకు అంటించిన నిప్పు వేడిగాఉండక చల్లగా ఉండటం ఆశ్చర్యం కాదా! మా తల్లి సీతామాత పాతివ్రత్య ప్రభావాన్ని, నిన్ను సేవించిన వారికి లభించిన భాగ్యాన్ని, నీ కటాక్షవీక్షణాల గొప్పదనాన్ని… బ్రహ్మ మొదలుగా గల దేవతలకైనా సాధ్యమేనా.
చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ!
పదవిభాగం: చరణము, సోకినట్టి, శిల, జవ్వని, రూపు, అగుట, ఒక్క వింత, సుస్థిరముగ, నీటిపై, గిరులు, తేలినది, ఒక్కటి, వింతగాని, మీ, స్మరణ, తనర్చు, మానవులు, సత్, గతి, చెందినది, ఎంత, వింత, ఈ ధరను, ధర, ఆత్మజ, రమణ, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: సీతాదేవికి పతి అయినవాడా, దశరథుని కుమారుడా, కరుణలో సముద్రము వంటివాడా, నీ పాదాల స్పర్శ తగలగానే ఒక రాయి స్త్రీగా మారింది. ఇది ఒక ఆశ్చర్యం. నీటిమీద నిలకడగా కొండలు తేలాయి. ఇది మరొక వింత. అందువ ల్ల ఈ భూమి మీద నిన్నుధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింతా లేదు.
కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ
పదవిభాగం: కరుములు, మీకున్, మ్రొక్కులు, ఇడన్, కన్నులు, మిమ్మునే, చూడన్, జిహ్వ, మీ స్మరణను, తనర్పన్, వీనులును, సత్కథలన్, వినుచుండ, నాస, మీ యరుతను, పెట్టు, పూసరులకున్, ఆసగొనన్, పరమాత్మ, సాధన, ఉత్కర ము, ఇది, చేయవే, కృపను, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో… చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూలవాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు.
జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!
పదవిభాగం: జీవనము, ఇంక, పంకమున, చిక్కిన, మీను, చలింపక, ఎంతయున్, తావునన్, నిల్చి, జీవనమె, తద్దయున్, కోరు విధంబు, చొప్పడన్, తావలమైన దానిన్, గురి తప్పనివాడు, తరించువాడయా, తావక, భక్తియోగమున, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: దయకు సముద్రము వంటివాడా! దశరథమహారాజ కుమారా! శ్రీరామా! కొలనులో నీరు ఇంకిపోయిన తరువాత అందులో బురద మాత్రమే మిగులుతుంది. ఆ బురదలో చిక్కిన చేపపిల్ల అక్కడ నుంచి కదలలేకపోతుంది. అప్పుడు అది నీరు కావాలనికోరుకుంటుంది. అదేవిధంగా మానవులు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత వారికి నువ్వు గుర్తు వస్తావు. అప్పుడు నీ మీద మనసు లగ్నం చేస్తారు. అలా చేసినప్పటికీ వారిని నువ్వు తప్పక అనుగ్రహిస్తావు.
సిరిగల నాడు మైమరచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలి చిచ్చుపై గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ
పదవిభాగం: సిరి, కలనాడు, మెయి, మరచి, చిక్కిననాడు, తలంచి, పుణ్యముల్, పొరిపొరి, చేయనైతిని, పొక్కిన, కల్గునె, గాలి, చిచ్చుపై, కెరలిన వేళ, తప్పికొని, కీడ్పడు వేళ, జలంబు, కోరి, తత్తరమున, త్రవ్వినం, కలదె, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: దశరథ పుత్రుడవైన రామా, దయకు సముద్రము వంటివాడా! శరీరానికి ముసలితనం వచ్చిన తరవాత, ఇప్పటి వరకు పుణ్యమైన పనులను ఏమీచేయలేకపోయానే అని ఎంత బాధపడినప్పటికీ ప్రయోజనం ఉండదు. గాలి ఎక్కువగా వీస్తూ మంటమీద దానిప్రభావం చూపించి, ఆ మంటను ఉవ్వెత్తున ఎగిసేలా చేస్తున్న వేసవికాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు దాహం తీర్చుకోవడం కోసం బావిని తవ్వటం మొదలుపెడితే లాభం ఉండదు. అందువలన ఓపికగా ఉన్న రోజులలోనే భగవంతుడి మీద భక్తితోపుణ్యకార్యాలను చేయాలి. (ముసలితనం రాక ముందే చేయాలి). లేకపోతే బాధపడవలసి వస్తుంది.
సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెరిగి గ్రహించువాడె కొలనేక నివాసముగాగ దర్దురం బరయగ నేర్చునెట్టు వికచాబ్జ మకరంద సైక సౌరభో త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ కరుణాపయోనిధీ!
పదవిభాగం: సరసుని, మానసంబు, సర సజ్ఞుడు, ఎరుంగురు, ముష్కర, అధముండు, ఎరిగి, గ్రహించువాడె, కొలను, ఏక నివాసము, కాగన్, దర్దురంబు, అరయగ, నేర్చును, ఎట్టు, వికచ, అబ్జ, మకరంద, సైక, సౌరభ, ఉత్కరము, మిళిందము, పొందు, క్రియ, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: దశరథుని కుమారుడైన రామా! దయ చూపడంలో సముద్రుని వంటివాడా! సరసుని (మంచి ఆలోచనలు ఉండటం) మనసును సరసజ్ఞుడు మాత్రమే అర్థం చేసుకుని, గ్రహించగలదు. అంతేకాని మూర్ఖుడయిన వాడు గ్రహించలేడు. నిరంతరం కొలనులోనే నివసించేకప్ప… వికసించిన పద్మాలలో ఉండే తేనెను గ్రహించలేదు. కాని దూరంగా తిరుగాడే తుమ్మెద మాత్రం ఆ మకరందాన్ని గ్రహించి, తుమ్మెద మీద వాలుతుంది. అదేవిధంగా నీ మహిమ నీ భక్తులకు మాత్రమే తెలుస్తుంది.
నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో రాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మేన్ దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
పదవిభాగం: నోచిన, తల్లి, తండ్రికి, తనూభవుడు, ఒక్కడె చాలు, మేటి, చేయి, చాచనివాడు, వేరొకడు, చాచిన లేదనక, ఇచ్చువాడు, నోరు, ఆచి, నిజంబ, కాని, పలుకు, ఆడనివాడు, ర ణంబులోన, మేన్, దాచనివాడు, భద్రగిరి, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: పూర్వజన్మ పుణ్యం కారణంగా… చేయి చాచి ఇతరులను ధనం కోరని కొడుకు ఒక్కడు కలిగితే చాలు. ఇతరులు సహాయం కోరితే లేదనకుండా దానం చేసేవాడు ఒక్కడు చాలు. నోరు తెరిచి నిజం మాత్రమే పలికేవాడు ఒక్కడు చాలు. యుద్ధంలో వెన్ను చూపనిధైర్యవంతుడు ఒక్కడు చాలు. అటువంటి కొడుకు మాత్రమే కొడుకు కాని, ఇతరులైన వారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు.
బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా తంక మనస్కుడెన్నగను దాశరథీ కరుణాపయోనిధీ!
పదవిభాగం: బొంకని వాడె, యోగ్యుడు, అరి, పుంజములు, ఎత్తినచోటన్, చివ్వకున్, జంకని వాడె, జోదు, రభసంబునన్, అర్థి, కరంబు, సాచినన్, కొంకనివాడె, దాత, మిమున్, కొల్చి, భజించినవాడెపో, నిరాతంక, మనస్కుడు, ఎన్నగను, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: దశరథుని కుమారా, దయలో సముద్రమువంటివాడా, అబద్ధం చెప్పనివాడు గొప్పవాడు, యోగ్యుడూను. శత్రువు బాగా దగ్గరకు వచ్చినప్పటికీ భయపడని వాడే వీరుడు, ధీరుడూను. యాచకుడు చేయి చాచి దానం అడిగినప్పుడు మంచిమనసుతో దానం చేసేవాడేఅసలయిన దాత. నిన్ను పూజించేవాడే అనుమానం లేని మనసు ఉన్నవాడు (నిర్మలమైన మనసు కలిగినవాడు)